భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న షేక్.మున్వర్ అనే వ్యక్తిపై పోలీసులు పీడీయాక్ట్ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు. అతన్ని చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు.
బూర్గంపాడు మండలం సారపాక గ్రామానికి చెందిన షేక్.మున్వర్, గతంలో పలుమార్లు గంజాయి అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడ్డాడు. 2024-2025 సంవత్సరాలలో బూర్గంపాడు, లక్ష్మీదేవిపల్లి, ఏడుళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్లలో అతనిపై కేసులు నమోదయ్యాయి. ఇటీవల దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 98 కిలోల గంజాయితో పట్టుబడ్డాడు.
మొత్తం ఐదు కేసులలో 287 కిలోల గంజాయిని సరఫరా చేసినట్లు నిర్ధారణ కావడంతో, అతనిపై పీడీయాక్ట్ (PIT NDPS Act) కింద చర్యలు తీసుకోవాలని పాల్వంచ డీఎస్పీ ఆర్.సతీష్ కుమార్, సీఐ కె.సతీష్ ప్రతిపాదించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పర్యవేక్షణలో సమర్పించిన ఆధారాలను పరిశీలించి, సీఐడీ అదనపు డీజీపీ చారు సిన్హా ఐపీఎస్, ఫిబ్రవరి 16, 2026న నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఉత్తర్వులను ఫిబ్రవరి 18, 2026న షేక్.మున్వర్ కు అందజేసి, అతన్ని చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. మార్చి 17, 2026న అడ్వైజరీ బోర్డు విచారణ జరిపి, అతనిపై నిర్బంధ ఉత్తర్వులను సమర్థించింది. దీంతో అతన్ని ఒక సంవత్సరం పాటు జైల్లో నిర్బంధించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
ప్రజల ఆరోగ్యాన్ని పాడుచేసే మాదకద్రవ్యాల వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని, అక్రమంగా సంపాదించిన ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంటామని సీఐ సతీష్ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిని ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.











