సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న తీవ్ర విద్యుత్ సంక్షోభంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకువచ్చారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావులను కలిసి, నేతన్నలపై పడిన రూ. 38 కోట్ల విద్యుత్ భారాన్ని రద్దు చేయాలని వినతిపత్రం అందజేశారు.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై ఉన్న బ్యాక్ బిల్లింగ్ మరియు సర్‌చార్జి మొత్తాలను పూర్తిగా మాఫీ చేయాలని, పాత బకాయిలతో సంబంధం లేకుండా పరిశ్రమకు నిరంతరాయంగా విద్యుత్ సబ్సిడీ ప్రయోజనాలు అందేలా ఆదేశాలు ఇవ్వాలని కేటీఆర్ కోరారు. కార్మికులు ఆత్మహత్యల బాట పట్టకుండా తక్షణ ఆర్థిక వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
గత ప్రభుత్వ హయాంలో 25 హెచ్.పి. వరకు విద్యుత్ సబ్సిడీ పెంచడం పరిశ్రమకు ఊతమిచ్చిందని, అయితే ప్రస్తుతం విద్యుత్ అధికారులు విధిస్తున్న 'బ్యాక్ బిల్లింగ్' భారం వేలాది కుటుంబాల జీవనోపాధిని ప్రమాదంలో పడేసిందని కేటీఆర్ వివరించారు. 2016 నుండి 2024 వరకు సుమారు 127 ఎస్.ఎస్.ఐ (SSI) యూనిట్లపై రూ. 19 కోట్ల బ్యాక్ బిల్లింగ్ భారం మోపారని, అది సర్‌చార్జిలతో కలిపి రూ. 38 కోట్లకు చేరిందని తెలిపారు.
ఈ భారీ బకాయిలను చెల్లించలేక అనేక యూనిట్లు మూతపడ్డాయని, ఇటీవల కాలంలో ఆర్థిక ఇబ్బందులతో 13 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత బాధాకరమని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బిల్లుల భారాన్ని మానవీయ కోణంలో రద్దు చేసి నేతన్నను ఆదుకోవాలని ఆయన విన్నవించారు.











