కామారెడ్డి పట్టణంలోని బస్ స్టాండ్ సమీపంలో ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పరిశుభ్రత లోపాలు, కృత్రిమ రంగుల వాడకం వంటి అంశాలపై అధికారులు దృష్టి సారించారు.
ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ బి.శిరిష, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జి.విక్రం నేతృత్వంలో జరిగిన ఈ తనిఖీల్లో, పలు ఫుడ్ సెంటర్లలో పరిశుభ్రత ప్రమాణాలు పాటించని వైనం బయటపడింది. అలాగే, కొన్ని చోట్ల ఆరోగ్యానికి హానికరమైన కృత్రిమ రంగులను ఆహార పదార్థాలలో ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ అక్రమాలకు పాల్పడుతున్న సంబంధిత హోటల్ యజమానులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించేలా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆహార పదార్థాల తయారీలో నాణ్యత, పరిశుభ్రత పాటించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.
కృత్రిమ రంగులు కలిగిన ఆహార పదార్థాల వినియోగం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఆహార వ్యాపారులు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని సూచించారు. నాణ్యమైన పదార్థాలతోనే ఆహారాన్ని తయారు చేయాలని ఆదేశించారు.











