రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా రామగుండం పోలీస్ కమిషరేట్ ఆధ్వర్యంలో 'అరైవ్ అలైవ్ – ఫేజ్-III' అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ, కారు ప్రయాణంలో సీట్ బెల్ట్ ధరించడం ప్రాణాలను కాపాడుతుందని, ఇది తప్పనిసరి అని నొక్కి చెప్పారు.
గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనా రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో, పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, డీసీపీ రామ్ రెడ్డి, ఏసీపీ ఎం.రమేష్ పాల్గొన్నారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని సీపీ తెలిపారు.
ప్రమాదాల్లో 70 శాతం మరణాలకు సీట్ బెల్ట్ ధరించకపోవడమే కారణమని సీపీ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. ఎయిర్ బ్యాగులు ఉన్నప్పటికీ, సీట్ బెల్ట్ ధరించకపోతే అవి సమర్థవంతంగా పనిచేయవని ఆయన స్పష్టం చేశారు. చిన్న దూర ప్రయాణాలకైనా సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
వాహన కొనుగోలు సమయంలో భద్రతా లక్షణాలను పరిగణనలోకి తీసుకోవాలని, సీట్ బెల్ట్ వినియోగం అలవాటు చేసుకుంటే 90 శాతం ప్రమాదాలను నివారించవచ్చని సీపీ వివరించారు. రోడ్డు భద్రత పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వాహనదారులకు విజ్ఞప్తి చేశారు.











