హైదరాబాద్ పరిసరాల్లోని జాతీయ రహదారి 65పై వరద నీరు నిలిచిపోవడం, లేఅవుట్లలో ఆక్రమణలు, వరద ముప్పు వంటి పలు సమస్యలపై హైడ్రా ప్రజావాణికి 42 ఫిర్యాదులు అందాయి. వీటిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
బీహెచ్ఈఎల్, రామచంద్రాపురం పరిసరాల్లోని జాతీయ రహదారి 65పై తరచుగా వర్షపు నీరు నిలిచిపోతోందని, దీనివల్ల తీవ్ర ట్రాఫిక్ అంతరాయం కలుగుతోందని మియాపూర్ ట్రాఫిక్ పోలీసులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. వరద కాలువల నిర్మాణం చేపట్టినా, అవుట్లెట్లు సరిగా లేకపోవడమే దీనికి కారణమని వారు పేర్కొన్నారు. మొత్తం 13 ప్రాంతాల్లో ఈ సమస్య ఉందని తెలిపారు.
అమీన్పూర్ మండలం బీరంగూడ గ్రామంలోని ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీకి చెందిన లేఅవుట్‌ను కొందరు ఆక్రమించి, ప్లాట్లు అమ్ముకుంటున్నారని సొసైటీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. 1982లో ఏర్పడిన ఈ లేఅవుట్లో ఉద్యోగులు కొనుగోలు చేసిన ప్లాట్లు ఇప్పుడు అన్యాక్రాంతం అవుతున్నాయని, పార్కులు, రహదారులను కాపాడాలని వారు కోరారు.
కాప్రా మున్సిపాలిటీ పరిధిలోని అమ్ముగూడ జేజేనగర్ను వరద ముంచెత్తుతోందని, వరద కాలువలను విస్తరించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. అలాగే, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సార్దార్నగర్లోని రావిర్యాల పెద్ద చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్‌ను నిర్ధారించాలని, లేకపోతే ఎగువన ఉన్న లేఅవుట్లు ముంపునకు గురవుతాయని ప్లాట్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు.
సోమవారం ఒక్కరోజే మొత్తం 42 ఫిర్యాదులు హైడ్రా ప్రజావాణికి అందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్, అడిషనల్ డైరెక్టర్ శ్రీ వర్ల పాపయ్య, సంబంధిత అధికారులకు పరిష్కార బాధ్యతలను అప్పగించారు. ఇదిలా ఉండగా, ప్రగతినగర్ చెరువుకు ఆనుకుని ఉన్న స్మశానవాటికను కాపాడినందుకు స్థానికులు హైడ్రా కమిషనర్‌ను అభినందించారు.











