బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం సర్వాయి పాపన్న గౌడ్ 317వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం వీరస్వామి గౌడ్ మాట్లాడారు. మొగల్ చక్రవర్తుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడి గోల్కొండను జయించిన సర్వాయి పాపన్న గౌడ్ వీరత్వాన్ని కొనియాడారు.
పాపన్న గౌడ్ వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషదాయకమని, ఆయన సైనిక వ్యూహాలు, బహుజన రాజ్యం స్థాపన చరిత్ర నేటి యువతరానికి ఆదర్శమని అన్నారు. ఆయన చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, భవిష్యత్ తరాలకు అందించాలని సూచించారు.
జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా నామకరణం చేయాలని, సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహం, ఉద్యానవనం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.











