ప్రజా గాయకుడు గద్దర్‌ను తెలంగాణ జాతిపితగా అధికారికంగా ప్రకటించాలని సామాజికవేత్త, ప్రొఫెసర్ కంచె ఐలయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు.
గద్దర్ గళం ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, కవులు, కళాకారులు హాజరయ్యారు. గద్దర్‌ను తెలంగాణ జాతిపితగా గుర్తించాలనే ప్రతిపాదన తాము చాలా కాలంగా చేస్తున్నామని ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఈ సందర్భంగా తెలిపారు.
తెలంగాణ ఉద్యమాన్ని గద్దర్ మళ్లీ తెరపైకి తెస్తున్నాడనే ఉద్దేశ్యంతోనే ఆయనపై కాల్పులు జరిగాయని ఐలయ్య ఆరోపించారు. కడుపులో బుల్లెట్లతోనే ఉద్యమంలో పాల్గొన్న గద్దర్, ఉద్యమానికి మలుపు తిరిగే పాటలను అందించారని ఆయన పేర్కొన్నారు.
కొంతమంది నాయకులు తమను తామే తెలంగాణ జాతిపితగా ప్రకటించుకుంటున్నారని ఐలయ్య విమర్శించారు. గద్దర్ పదవుల కోసం ఎప్పుడూ ఆశపడలేదని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అధికారానికి దూరంగా ఉన్నారని తెలిపారు.
గద్దర్‌కు విప్లవ పక్షం, తెలంగాణ ఉద్యమ పక్షం అనే రెండు కోణాలు ఉన్నాయని, ఫాదర్ ఆఫ్ తెలంగాణగా ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయని ఐలయ్య స్పష్టం చేశారు.











