నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీపీసీసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఎన్హెచ్ఎం జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ప్రతినిధులతో ములాఖత్ కార్యక్రమంలో భాగంగా బుధవారం కామారెడ్డిలో ఉద్యోగులు గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్యలు, పెండింగ్ వేతనాలు, రెగ్యులరైజేషన్ వంటి అంశాలను వివరించారు. ఇతర రాష్ట్రాల్లో అమలైన రెగ్యులరైజేషన్కు సంబంధించిన జీవోలను కూడా సమర్పించారు.
వినతిపై స్పందించిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, ఉద్యోగుల రెగ్యులరైజేషన్ అంశాన్ని ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలను కూడా పరిశీలిస్తామని తెలిపారు. కరోనా సమయంలో సిబ్బంది చేసిన సేవలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు.
జేఏసీ జిల్లా అధ్యక్షుడు తాళ్ళపెల్లి సుమన్ మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించి రెగ్యులరైజేషన్ సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.








