జన గణన ప్రక్రియలో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, స్వీయ నమోదు చేసుకుని, డిజిటల్ స్వీయ గణన విధానాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆన్లైన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా ప్రజలు తమ వివరాలను సులభంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జన గణన ప్రక్రియలో భాగంగా స్వీయ నమోదు చేసుకున్నారు. అందుబాటులో ఉన్న ఆన్ లైన్ వెబ్ సైట్ https://se.census.gov.in ద్వారా తన వివరాలను నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం డిజిటల్ స్వీయ గణన విధానాన్ని ప్రవేశపెట్టిందని ఆయన పేర్కొన్నారు.
మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఆన్లైన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా ప్రజలు తమ వ్యక్తిగత, కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించబడిందని వివరించారు. స్వీయ గణన ఈ నెల 26 నుండి ప్రారంభమైందని, మే 10వ తేదీ వరకు కొనసాగుతుందని, ఈ ప్రక్రియను సుమారు 15 నిమిషాల్లో పూర్తి చేసుకోవచ్చని తెలిపారు.
వివరాలు నమోదు చేసుకున్న తర్వాత ప్రత్యేకమైన సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడి (SEID) జారీ చేయబడుతుందని, క్షేత్రస్థాయిలో ఇంటికి వచ్చే ఫీల్డ్ ఎన్యుమరేటర్లకు ఈ ఐడి నెంబర్ ను తెలియజేయాలని సూచించారు. ఆన్లైన్ లో నమోదు చేసిన సమాచారాన్ని ఎన్యూమరేటర్లు ధృవీకరిస్తారని, దీనివల్ల ప్రయాణాల్లో ఉన్నవారు, వలస కార్మికులు కూడా సులభంగా పాల్గొనే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.
స్వీయ గణనలో ఖచ్చితమైన చిరునామా, సరైన వివరాలు నమోదు చేయాలని, వీటి ఆధారంగానే ఎన్యూమరేటర్ల నియామకం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. సాంకేతికతను ఉపయోగించి ప్రతి పౌరుడి వివరాలు జన గణనలో చేరేలా చూడడమే లక్ష్యంగా ఈ ప్రక్రియను ప్రవేశపెట్టారని, జిల్లా ప్రజలందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని భరోసా కల్పించారు.












