మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఇంధన సరఫరా పరిస్థితిపై అదనపు కలెక్టర్ డి. విజయేందర్ రెడ్డి, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో సోమవారం అత్యవసర టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఎలాంటి ఇంధన కొరత లేదని, ప్రజలు ఆందోళన చెంది ముందస్తుగా ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఇటీవల ప్రజలు పెద్ద ఎత్తున పెట్రోల్ బంకులకు రావడంతో అమ్మకాలు రెట్టింపు అయ్యాయని, దీనివల్ల కొన్ని బంకుల్లో తాత్కాలికంగా నిల్వలు తగ్గినట్లు కనిపించిందన్నారు. అయితే, జిల్లాలో ఇంధన సరఫరాను యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఐఓసీఎల్, బిపిసిఎల్, హెచ్పీసీఎల్ సంస్థలు అదనపు ట్యాంకర్ల ద్వారా ఇంధనాన్ని సరఫరా చేస్తున్నాయని, ఆయిల్ డిపోలు అర్ధరాత్రి 12 గంటల వరకు పనిచేస్తూ ట్యాంకర్లను పంపిస్తున్నాయని వివరించారు. సోమవారం సాయంత్రానికల్లా 80-90 శాతం బంకులకు, మంగళవారం ఉదయానికల్లా మిగిలిన బంకులకు సరఫరా పూర్తవుతుందని అధికారులు తెలిపారు.
పెట్రోల్ బంకుల వద్ద అనవసర రద్దీని నియంత్రించేందుకు పోలీసుల సహకారంతో చర్యలు చేపడుతున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, ఒకటి రెండు రోజుల్లో పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని అధికారులు భరోసా ఇచ్చారు.
ప్రజలు ఆందోళన చెందకుండా, తమ అవసరాలకు తగినంత మేరకే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. తాత్కాలికంగా ఏర్పడిన రద్దీ వల్ల ఇంధన కొరత ఏర్పడిందనే అపోహలను వీడాలని సూచించారు.











