ప్రముఖ సామాజికవేత్త ఎం. శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం (RTI) పౌరులకు ప్రభుత్వ వ్యవహారాలపై సమాచారం పొందే హక్కును కల్పిస్తూ, ప్రజాస్వామ్య పాలనలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంపొందించే కీలక సాధనమని పేర్కొన్నారు.
ప్రభుత్వ కార్యకలాపాలపై సమాచారం తెలుసుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, అవినీతి, నిర్లక్ష్యం వంటి సమస్యలను ఎదుర్కోవడానికి RTI ఒక శక్తివంతమైన ఆయుధమని శ్రీనివాస్ కుమార్ తెలిపారు. ప్రజల చైతన్యమే ఈ చట్టాన్ని సజీవంగా ఉంచుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అధికారుల నిర్లక్ష్యం, జాప్యం వంటి సందర్భాలలో RTI ద్వారా సమాచారం కోరవచ్చని, ఇది సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందని ఆయన వివరించారు. RTI దరఖాస్తులపై 30 రోజులలోగా స్పందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, లేనిచో అప్పీలు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.
అప్పీలు ప్రక్రియలోనూ సమాచారం లభించని పక్షంలో ఉన్నతాధికారులను, కలెక్టర్లను, కమిషనర్లను సంప్రదించవచ్చని, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి సమాచారం పొందవచ్చని శ్రీనివాస్ కుమార్ పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై జరిమానాతో పాటు ఇతర చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆయన వివరించారు.
ప్రతి పౌరుడు RTI చట్టం 2005పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఇది తమ హక్కులను పరిరక్షించుకోవడానికి అత్యంత ఆవశ్యకమని ఆయన నొక్కి చెప్పారు. ప్రజలను చైతన్యపరిచేందుకు తాను నిరంతరాయంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.











