కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మహమ్మద్ అహ్మద్ (40) అనే వ్యక్తి, సులభంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో గత కొంతకాలంగా ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్నాడు. డూప్లికేట్ తాళాలను ఉపయోగించి బైక్లను దొంగిలించి, వాటి నంబర్ ప్లేట్లను మార్చి వినియోగిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
గత నెల 26న ఎల్లారెడ్డి వారం సంతలో పార్క్ చేసిన ఒక టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనాన్ని దొంగిలించిన తర్వాత, పోలీసులు సాంకేతిక ఆధారాలు, విశ్వసనీయ సమాచారం ఆధారంగా నిందితుడిని గుర్తించారు. మే 1న అతని నివాసంలో అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడి వద్ద నుండి హీరో హోండా ప్యాషన్ ప్రో (బ్లూ), టీవీఎస్ ఎక్స్ఎల్ (గ్రీన్), హీరో హోండా CD 100 SS (రెడ్), మరో టీవీఎస్ ఎక్స్ఎల్ (గ్రీన్), హీరో హోండా ప్యాషన్ ప్లస్ (రెడ్) వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో కొన్ని వాహనాల నంబర్ ప్లేట్లు మార్చినట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న వాహనాల విలువ సుమారు రూ. 2 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.
నిందితుడిని రిమాండ్కు తరలించిన పోలీసులు, కేసులో మరిన్ని వివరాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఆపరేషన్లో డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ డి. రాజారెడ్డి, ఎస్సైలు బి. మహేష్, సుబ్రహ్మణ్య చారి, ఏఎస్సై దేవగౌడ్, పలువురు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.








