రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాల చెల్లింపుల్లో జాప్యంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ చెల్లింపులను జూన్ 10వ తేదీలోపు పూర్తి చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించింది.
రిటైర్డ్ ఉద్యోగులు తమ ప్రయోజనాలు అందడం లేదని దాఖలు చేసిన 754 పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రతి పిటిషన్లో ఎంత మందికి ప్రయోజనాలు చెల్లించారో వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
రిటైర్డ్ ఉద్యోగులు సున్నితమైన వర్గమని, వారి జీవితాలతో ఆడుకోకూడదని కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని వారికి రావాల్సిన ప్రయోజనాలను చెల్లించాలని హెచ్చరించింది.
ఈ కేసు విచారణను జూన్ 10వ తేదీకి వాయిదా వేస్తూ, అప్పటిలోపు అన్ని ప్రయోజనాల చెల్లింపులు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణకు వచ్చేసరికి ఒక్క రిటైర్డ్ ఉద్యోగి కూడా ప్రయోజనాలు అందలేదని చెప్పకూడదని కోర్టు కఠినంగా వ్యాఖ్యానించింది.
ఆర్థిక శాఖ నిర్లక్ష్యంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 'వాళ్ల డబ్బులు వాళ్లకే ఇవ్వడానికి ఎందుకింత ఆలస్యం?' అని కోర్టు ప్రశ్నించింది.











