ఏజెన్సీ ప్రాంత షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) స్వతంత్ర హక్కుల పరిరక్షణ కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఎనగంటి కృపాకర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఈనెల 17వ తేదీన కొత్తగూడెంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
కొత్తగూడెం అంబేద్కర్ కమ్యూనిటీ హాలులో ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నట్లు కృపాకర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏజెన్సీ ప్రాంత ఎస్సీల రిజర్వేషన్లను జనరల్ లోకి మార్చడం వల్ల వారికి అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. న్యాయం జరిగే వరకు అందరూ కలిసికట్టుగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశానికి షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడ రమేష్, సింగరేణి రిటైర్డ్ జిఎం ఎస్ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని సమాచారం. వీరితో పాటు పలువురు సామాజిక, ఉద్యమ నాయకులు, మేధావులు, యువత పాల్గొనాలని కోరారు.
ఈ సమావేశం ద్వారా ఏజెన్సీ ప్రాంత ఎస్సీల హక్కుల పరిరక్షణకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రిజర్వేషన్ల పరిరక్షణ, ఇతర సమస్యలపై చర్చించి, తదుపరి కార్యాచరణను ఖరారు చేయాలని భావిస్తున్నారు.











