అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని యాడారం గ్రామంలో ప్రజా ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. లబ్ధిదారులైన షేక్ అయిషా హైమద్ దంపతులకు ప్రభుత్వం మంజూరు చేసిన ₹5 లక్షల నిధులతో నిర్మించిన నూతన గృహాన్ని అధికారులు ప్రారంభించారు.
జిల్లా ఆర్టీఏ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి, కమిషనర్ చంద్రశేఖర్ రిబ్బన్ కట్ చేసి గృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేస్తోందని కొనియాడారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అందిస్తున్న ₹5 లక్షల ఆర్థిక సాయం పేద కుటుంబాలకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
లబ్ధిదారులు షేక్ అయిషా, హైమద్ దంపతులు తమకు ఇల్లు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్సీ, డీసీసీ అధ్యక్షుడు మరియు స్థానిక నాయకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రభుత్వం పట్ల జీవితాంతం రుణపడి ఉంటామని వారు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుంకి రమేష్, పలువురు కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్, స్థానిక నాయకులు మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.







