భారతదేశాన్ని ఆధునిక ప్రపంచం వైపు నడిపించిన మహోన్నత దార్శనికుడు, మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఏర్పాటు చేసిన స్మారక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని నివాళులర్పించి, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.
నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలం దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గదని, ఆయన తీసుకువచ్చిన విప్లవాత్మక చట్టాలు, దూరదృష్టితో కూడిన విధానాలే నేటి నవభారత ప్రగతికి బలమైన పునాదులని స్పష్టం చేశారు.
1985లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, 1988లో ఓటు హక్కు కనీస వయస్సును 18 ఏళ్లకు తగ్గించడం వంటి సంస్కరణలు దేశ రాజకీయ స్థిరత్వానికి, యువత భాగస్వామ్యానికి దోహదపడ్డాయని తెలిపారు.
1986 జాతీయ విద్యా విధానం ద్వారా 'నవోదయ విద్యాలయాలు' స్థాపన, కంప్యూటర్ విప్లవానికి పునాదులు వేయడం వంటివి నేటి భారతదేశం ఐటీ, టెలికాం రంగాలలో ఎదగడానికి కారణమయ్యాయని పేర్కొన్నారు.
మహాత్మా గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం కోసం స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ, మహిళా రిజర్వేషన్ల ఆలోచనకు ఆయనే శ్రీకారం చుట్టారని, ఇది తదనంతర రాజ్యాంగ సవరణలకు మార్గదర్శకమైందని వివరించారు. దేశ సమగ్రత కోసం ప్రాణాలర్పించిన రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం కాంగ్రెస్ శ్రేణులంతా కట్టుబడి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.












