మద్యం మత్తులో ఇంట్లో గొడవ పడుతున్న అల్లుడు, తన అత్తపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన వట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గత కొన్ని రోజులుగా మద్యం సేవించి భార్య ఫాతిమాతో గొడవ పడుతున్న మహ్మద్ గరీబ్ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో, ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు బాధితురాలి తల్లి (50) అక్సాన్ పల్లి నుంచి వారి ఇంటికి వచ్చింది. అయితే, అల్లుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.
పోలీసుల కథనం ప్రకారం, మద్యం మత్తులో ఉన్న అల్లుడు, తన భార్యను తోసేసి, అక్కడికి వచ్చిన తన అత్తను గదిలోకి లాక్కెళ్లి, తలుపు గడియపెట్టి అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం.
ఈ ఘటనపై బాధితురాలు వట్ పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో, పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేసుకున్నారు.
ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకునే ప్రక్రియ కొనసాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.











