ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు మరియు చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులకు ప్రొద్దుటూరు అదనపు ఎస్పీ విబు కృష్ణ ఐపీఎస్ శనివారం కౌన్సిలింగ్ నిర్వహించి, ప్రవర్తన మార్చుకోకపోతే పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు ఈ కౌన్సిలింగ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రూరల్ సీఐ ఎం. నాగభూషణ్ మాట్లాడుతూ, నేర ప్రవృత్తిని విడిచి సమాజంలో మంచి నడవడికతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని సూచించారు. నేరాలు చేయడం వల్ల కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, 'రౌడీ షీటర్' అనే ముద్ర పిల్లల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని గ్రహించాలని తెలిపారు.
ఏఎస్పీ విబు కృష్ణ మాట్లాడుతూ, నేర ప్రవృత్తిని మార్చుకునేందుకు ఒక అవకాశం ఇస్తున్నామని, మార్పు లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అసాంఘిక కార్యక్రమాలు, గొడవలు, దౌర్జన్యాలు, వివాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రవర్తనలో మార్పు రాకపోతే పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ ఎం. నాగభూషణ్, ఎస్.ఐలు శ్రీకాంత్, రాజు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.







