పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తి చేయాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ వచ్చే నెలలో చేపట్టనున్న పాదయాత్రపై తెలంగాణ రక్షణ సేన నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా పాలమూరు జిల్లాకు ద్రోహం చేసిందే బీఆర్ఎస్ అని, ఇప్పుడు పాదయాత్ర పేరుతో నాటకాలు ఆడుతుందని ఆరోపించారు.
మహబూబ్ నగర్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నాయకులు, పాలమూరు వలసలకు, వెనుకబాటుతనానికి కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. చేసిన అన్యాయానికి బీఆర్ఎస్ ను ఈ ప్రాంత ప్రజలు ఎన్నటికీ క్షమించరని స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ నాయకుడు గొంగళ్ల రంజిత్ మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడిన తర్వాత పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తారనే నమ్మకంతో జిల్లా ప్రజలు 12 ఎమ్మెల్యే స్థానాలను బీఆర్ఎస్ కు ఇచ్చారని గుర్తు చేశారు. అయితే, బీఆర్ఎస్ ప్రభుత్వం మహబూబ్ నగర్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైందని, పదేళ్ల పాలనలో ఒక్క ఎకరాకు కూడా నీళ్లు అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ.35 వేల కోట్ల నుండి రూ.85 వేల కోట్లకు పెంచి కాంట్రాక్టర్ల జేబులు నింపి, స్థానిక ప్రజల కడుపు కొట్టారని రంజిత్ కుమార్ ఆరోపించారు. భూ నిర్వాసితులైన రైతుల డబ్బులను కూడా బీఆర్ఎస్ నేతలు దోచుకున్నారని, లక్ష్మిదేవిపల్లిలో కవిత సభతో బీఆర్ఎస్ లో ఉలికిపాటు మొదలైందని, అందుకే పాదయాత్ర డ్రామాలు మొదలుపెట్టారని విమర్శించారు.
పాలమూరుకు బీఆర్ఎస్ చేసిన ద్రోహానికి ప్రజలు ఎన్నటికీ క్షమించరని టీఆర్ఎస్ నేత గవినోళ్ల శ్రీనివాస్ అన్నారు. చేసిన తప్పులకు పశ్చాత్తాపం లేకుండా పాదయాత్ర చేయడం ఏమిటని ప్రశ్నించారు. ముందుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వెంకట రమణ మూర్తి మాట్లాడుతూ, పదేళ్ల అధికారంలో ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉంటే ఇప్పుడు పాదయాత్ర అవసరం ఉండేది కాదని, ప్రాజెక్ట్ పేరుతో వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ కూడా మహబూబ్ నగర్ ప్రజలకు అన్యాయం చేస్తుందని, అయితే భవిష్యత్ లో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కవిత ప్రాజెక్ట్ పూర్తి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు మెట్రకాడి ప్రభాకర్ మాట్లాడుతూ, పదేళ్ల అధికారం తర్వాత మళ్లీ మోసం చేయడానికి వస్తున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేన్నరేళ్లు గడుస్తున్నా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని అన్నారు.











