సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం లో గల బయోకాన్ లిమిటెడ్ లో సోమవారం నిర్వహించిన పారిశ్రామిక ప్రమాదాల మాక్ డ్రిల్ విజయవంతంగా పూర్తయింది. అదనపు కలెక్టర్ పాండు, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ డ్రిల్, అత్యవసర పరిస్థితులకు జిల్లా యంత్రాంగం సన్నద్ధతను ప్రదర్శించింది.
పారిశ్రామిక ప్రమాదాలు సంభవించినప్పుడు చేపట్టాల్సిన తక్షణ చర్యలు, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అవగాహన, సన్నద్ధతను పరీక్షించేందుకు ఈ మాక్ డ్రిల్ ను నిర్వహించారు. విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించే లక్ష్యంతో చేపట్టిన సహాయక చర్యలు వాస్తవికతను తలపించాయి.
అంబులెన్స్ లు, అగ్నిమాపక శకటాలు, వైద్య బృందాలు, పోలీస్, రెవెన్యూ, ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందాలు సమన్వయంతో వ్యవహరించి, తమ సహాయక చర్యల ద్వారా విపత్తుల నిర్వహణపై సన్నద్ధతను చాటి చెప్పాయి. ఈ చర్యలు ప్రజల్లో, పరిశ్రమ కార్మికుల్లో భద్రతపై నమ్మకాన్ని పెంపొందించాయి.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పాండు మాట్లాడుతూ, అత్యవసర సమయాల్లో అప్రమత్తతతో నష్టాన్ని నివారించవచ్చని, అన్ని శాఖల అధికారులు, కంపెనీ యాజమాన్యం, ఎన్.డి.ఆర్.ఎఫ్, ఉద్యోగుల సమన్వయంతోనే మాక్ డ్రిల్ విజయవంతమైందని తెలిపారు. అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి కంపెనీ ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్ సమర్థవంతంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సంబంధిత అధికారులు, కంపెనీ యాజమాన్యం తక్షణ చర్యలు చేపట్టడంతో పాటు ప్రభుత్వ శాఖలకు సమాచారం అందించాలని ఆమె సూచించారు.








