జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల పదవీకాలం ముగిసినప్పటికీ, హైదర్‌నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ నాయకుడు నార్ని శ్రీనివాస్ ఇంకా కార్పొరేటర్‌గా వ్యవహరిస్తూ, అభివృద్ధి పనుల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, న్యాయవాది సిందం శ్రీకాంత్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో కొందరు మున్సిపల్ అధికారుల సహకారం కూడా ఉందని ఆయన విమర్శించారు.
గత ఫిబ్రవరి 10న కార్పొరేటర్ల పదవీకాలం ముగిసినా, నార్ని శ్రీనివాస్ తనను తాను ఇంకా కార్పొరేటర్‌గా చెప్పుకుంటూ, డివిజన్లో తిరుగుతూ, అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ఫోజులిస్తున్నారని సిందం శ్రీకాంత్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఇది ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమని ఆయన అన్నారు.
మాజీ కార్పొరేటర్‌కు మున్సిపల్ అధికారులు, సిబ్బంది వత్తాసు పలుకుతున్నారని, ఇంజనీరింగ్, శానిటేషన్ విభాగాల డీఈలు మౌనిక, శంకర్ గణేష్‌తో పాటు మరికొందరు సిబ్బంది ఆయనతో కలిసి పర్యటించడం అధికార దుర్వినియోగం, ప్రోటోకాల్ ఉల్లంఘన అని శ్రీకాంత్ విమర్శించారు.
పదవీకాలం ముగిసిన మాజీ కార్పొరేటర్‌తో ఆల్విన్ కాలనీ సర్కిల్ మున్సిపల్ ఉద్యోగులు ఏ ప్రోటోకాల్ ప్రకారం తిరుగుతున్నారో సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మున్సిపల్ సిబ్బంది కాంగ్రెస్ కార్యకర్తలుగా వ్యవహరించడం సిగ్గుచేటని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
ఇలాంటి పద్ధతులు మానుకోవాలని, లేనిపక్షంలో ప్రోటోకాల్ ఉల్లంఘనలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని ఆయన హెచ్చరించారు.










