నిజామాబాద్, జూలై 13
నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను 120 నుంచి 150కు పెంచుతూ జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ అదనపు సీట్లకు ప్రవేశాలు కల్పించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణమోహన్ తెలిపారు.
నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ప్రవేశాల సంఖ్యను 120 నుంచి 150కు పెంచేందుకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. దీంతో ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి కళాశాలలో మొత్తం 150 ఎంబీబీఎస్ సీట్లకు ప్రవేశాలు కల్పించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్, అదనపు వైద్య విద్య సంచాలకుడు డాక్టర్ కృష్ణమోహన్ తెలిపారు.
అదనంగా 30 సీట్ల మంజూరు కోసం ఈ ఏడాది జూన్ 17న ఎన్ఎంసీ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డుకు చెందిన నలుగురు సభ్యుల బృందం ప్రభుత్వ వైద్య కళాశాలతో పాటు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రత్యక్ష తనిఖీలు నిర్వహించింది. బోధన, వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల లభ్యత, ఆసుపత్రి నిర్వహణ తదితర అంశాలను పరిశీలించిన అనంతరం సంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ తనిఖీ నివేదిక ఆధారంగా జూలై 13న ఎన్ఎంసీ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు మరో 30 ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేస్తూ అధికారిక అనుమతి పత్రం (లెటర్ ఆఫ్ పర్మిషన్) జారీ చేసింది.
ఈ అనుమతితో నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 120 నుంచి 150కు పెరగడంతో జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణ ప్రాంత విద్యార్థులకు వైద్య విద్యలో మరిన్ని అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.












