కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, నీట్ పరీక్షల నిర్వహణలో అవకతవకలు, ఆత్మహత్యల ఘటనలపై కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ ఘటనలు విద్యార్థుల ఆత్మహత్యలు కావని, వ్యవస్థ చేసిన హత్యలని ఆయన ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
లఖింపూర్ ఖేరీకి చెందిన 22 ఏళ్ల హృతిక్ మిశ్రా, మూడోసారి నీట్ పరీక్ష రాస్తున్నానని, పరీక్ష రద్దు కావడంతో తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. గోవాలో కూడా నీట్ పరీక్ష రాసిన మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారని గుర్తుచేశారు. ఈ సంఘటనలు విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
2015 నుంచి 2026 వరకు దేశవ్యాప్తంగా 148 పరీక్షల కుంభకోణాలు వెలుగుచూశాయని, వాటిలో 87 పరీక్షలు రద్దయ్యాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. దాదాపు 9 కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తు ఈ కుంభకోణాల వల్ల ప్రభావితమైందని ఆయన తెలిపారు. ఈ కుంభకోణాల్లో కేవలం ఒకరికి మాత్రమే శిక్ష పడిందని, బాధ్యులైన అధికారులు, మంత్రులు ఎవరూ బాధ్యత వహించలేదని విమర్శించారు.
ప్రత్యేకంగా నీట్, ఏఐపీఎంటీ, ఇతర వైద్య ప్రవేశ పరీక్షల్లోనే 15 కుంభకోణాలు జరిగాయని ఆయన అన్నారు. ఈ వ్యవహారాల్లో బాధ్యులైన అధికారులు, మంత్రులు రాజీనామా చేయకపోవడం అత్యంత సిగ్గుచేటని ధ్వజమెత్తారు. కొందరిని తొలగించినట్లు చూపించి, తిరిగి ఉన్నత పదవుల్లో నియమిస్తున్నారని ఆరోపించారు.
‘మోసానికి సహకరించే వారికి బహుమతులు లభిస్తుండగా, పరీక్షలు రాసే పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు’ అని రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి, ‘మీలో జవాబుదారీతనం మేల్కొనడానికి ఇంకా ఎంతమంది హృతిక్లు కావాలి?’ అని ప్రశ్నించారు. విద్యార్థుల బాధ తన బాధ అని, వారి భవిష్యత్తును దోచుకున్న వారు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ‘ఎంత కాలం పట్టినా సరే, ఎవరినీ వదిలిపెట్టం. ఈ యుద్ధాన్ని మనం కలిసి పోరాడదాం.. మనం గెలుస్తాం’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.










