సమాజంలో చదువుపై ఆసక్తిని, యువతలో చైతన్యాన్ని పెంపొందించడంలో మంచి పుస్తకాల ప్రాధాన్యతను గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు, టీజేఏసీ సెక్రటరీ జనరల్ వైద్యనాథ్ నొక్కి చెప్పారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా గ్రంథాలయంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్యకు పలు విలువైన పుస్తకాలను ఆయన అందజేశారు.
వైద్యనాథ్ మాట్లాడుతూ, గ్రంథాలయాలు కేవలం పుస్తకాల నిల్వ కేంద్రాలు మాత్రమే కాదని, అవి జ్ఞానానికి మార్గదర్శకాలని పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పార్లమెంట్ ప్రసంగాలు, అంబేద్కర్ జీవిత చరిత్ర, బుద్ధుని చరిత్ర, భగవద్గీతతో పాటు పలు విలువైన పుస్తకాలను గ్రంథాలయానికి అందించారు.
డాక్టర్ అంబేద్కర్ ఆలోచనలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని, ఆయన జీవితం సమానత్వం, విద్య, సామాజిక న్యాయం వంటి విలువలను తెలియజేస్తుందని వైద్యనాథ్ అన్నారు. ఈ విలువలు నేటి సమాజానికి ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
అలాగే, బుద్ధుని బోధనలు మనుషుల్లో శాంతి, సహనం, మానవతా భావాలను పెంపొందిస్తాయని తెలిపారు. గ్రంథాలయాల్లో ఇటువంటి చరిత్రాత్మక, ఆధ్యాత్మిక, సామాజిక చైతన్యం కలిగించే పుస్తకాలు అందుబాటులో ఉండటం వల్ల విద్యార్థులు, పాఠకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కార్యదర్శి వసుంధర, సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు.












