సమాజంలో పెరుగుతున్న అసమానతలు, కుల-మత విభజనలు, రాజకీయ అవినీతి వంటి సమస్యలకు నవ్య మానవవాదమే శాశ్వత పరిష్కారమని సామాజిక కార్యకర్త, మానవవాది కె. శ్రీనివాసాచారి అన్నారు. ప్రముఖ తత్వవేత్త మానవేంద్రనాథ్ రాయ్ 139వ జయంతి సందర్భంగా ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు.
మార్చి 21న జరిగిన ఈ కార్యక్రమంలో, శ్రీనివాసాచారి మాట్లాడుతూ, ఎం.ఎన్. రాయ్ ఆలోచనలు నేటికీ అత్యంత ప్రాసంగికమని, ఆయన ఆచరణ, తాత్వికతపై భారతీయుల్లో సరైన అవగాహన లేకపోవడం బాధాకరమని తెలిపారు. రాయ్‌ను కేవలం ఒక విప్లవకారుడిగా కాకుండా, ప్రపంచస్థాయి ఆలోచనాపరుడిగా చూడాలని ఆయన సూచించారు.
1887 మార్చి 21న జన్మించిన రాయ్, జీవితాంతం సమాజ మార్పు కోసం పోరాడారని, మొదట ఆయుధ విప్లవాన్ని ఆశ్రయించినా, కాలక్రమేణా తన ఆలోచనలను మార్చుకొని మానవవాద తత్వాన్ని అభివృద్ధి చేశారని వివరించారు. రష్యా తర్వాత ప్రపంచంలో తొలి కమ్యూనిస్టు పార్టీని మెక్సికోలో స్థాపించడం ఆయన గొప్ప చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు.
అమెరికాలో ఉన్నప్పుడు సోషలిస్టు సాహిత్యం, కారల్ మార్క్స్ రచనల అధ్యయనం రాయ్ ఆలోచనలకు కొత్త దిశనిచ్చిందని, అనంతరం కమ్యూనిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన, భారతదేశంలో రాజకీయ చైతన్యానికి పునాది వేశారని తెలిపారు. బ్రిటీష్ పాలనలో జైలు జీవితం గడిపిన సమయంలో విస్తృతంగా అధ్యయనం చేసి, తన తాత్విక దృష్టిని లోతుగా చేసుకున్నారని, ఆ జైలు జీవితం ఆయనను విప్లవకారుడి నుంచి తాత్విక మానవవాదిగా మార్చిందని చెప్పారు.
రాయ్ కేవలం రాజకీయ నాయకుడే కాకుండా, స్వతంత్ర భారత రాజ్యాంగం అవసరాన్ని ముందుగానే గుర్తించిన తొలి వ్యక్తుల్లో ఒకరని, పార్టీ రాజకీయాలు అధికారం, అవినీతి వైపు దారితీస్తాయని గ్రహించి ‘రాడికల్ హ్యూమనిజం’ ఉద్యమాన్ని ప్రారంభించడం ఆయన దూరదృష్టికి నిదర్శనమని అన్నారు. కుల వ్యవస్థపై రాయ్ చేసిన విశ్లేషణలు, అస్పృశ్యతను తొలగించడానికి మూలమైన సామాజిక వ్యవస్థ మారాల్సిందేనని ఆయన చెప్పిన మాటలు నేటికీ సత్యమని పేర్కొన్నారు. ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న విభజనలు, అసహనం, అంధ విశ్వాసాల నేపథ్యంలో రాయ్ ప్రతిపాదించిన నవ్య మానవవాదం అత్యవసరమని, హేతువాదం, శాస్త్రీయ దృక్పథం, మానవ విలువల ఆధారంగా సమాజాన్ని పునర్నిర్మించుకోవడం ద్వారానే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు.











