కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడింది. మధురైలో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు, జల్ జీవన్ మిషన్ పథకం పొడిగింపు, పలు కీలక రహదారుల నిర్మాణానికి ఆమోదం లభించింది.
మధురైలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ఆ ప్రాంతంలో విమానయాన రంగ అభివృద్ధికి ఊతమిస్తుందని భావిస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను మెరుగుపరిచే లక్ష్యంతో అమలు అవుతున్న జల్ జీవన్ మిషన్ పథకాన్ని 2028 డిసెంబర్ వరకు పొడిగించాలని కేంద్రం నిర్ణయించింది.
దేశవ్యాప్తంగా రహదారి మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే దిశగా, సంత్రాగచ్చి - ఖరగ్పూర్ మధ్య 4 లైన్ల రహదారి, సైంథియా - పాకూర్ మధ్య 4 లైన్ల రహదారి నిర్మాణాలకు ఆమోదం లభించింది. అలాగే, బద్నావర్ - థాండియా - తిమర్వాని మధ్య 5 లైన్ల రహదారి నిర్మాణానికి కూడా ఆమోదం దక్కింది.
జెవార్ విమానాశ్రయం - ఫరీదాబాద్ సెక్షన్ను అనుసంధానిస్తూ 6 లైన్ల ఎలివేటెడ్ రోడ్డు నిర్మాణానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులు రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చనున్నాయి.

