మహిళలకు తప్పనిసరి నెలసరి సెలవును మంజూరు చేయడం వల్ల వారి ఉపాధి అవకాశాలు దెబ్బతినే అవకాశం ఉందని భారత సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాంటి చట్టాన్ని అమలు చేస్తే, యాజమాన్యాలు మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి వెనుకడుగు వేసే ప్రమాదం ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు.
నెలసరి సెలవును తప్పనిసరి చేయడం వల్ల పురుషులతో పోలిస్తే తాము తక్కువ అనే మానసిక భయం మహిళల్లో ఏర్పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై న్యాయవాది శైలేంద్ర త్రిపాఠి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
నెలసరి సెలవులకు సంబంధించి నియమ నిబంధనలను రూపొందించడంలో రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గనిర్దేశం చేయాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్ ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
ప్రస్తుతం కొన్ని సంస్థలు స్వచ్ఛందంగా మహిళలకు నెలసరి సెలవులను అందిస్తున్నాయి. అయితే, దీనిని చట్టబద్ధం చేయడం వల్ల కలిగే సానుకూల, ప్రతికూల అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధి అవకాశాలు తగ్గడం వంటి ప్రతికూల పరిణామాలను నివారించడానికి, మహిళల ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి మధ్యేమార్గంగా పరిష్కారాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి.

