మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను జాప్యం చేయకుండా సంబంధిత శాఖల అధికారులు సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని అదనపు జిల్లా కలెక్టర్ విజయేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇన్చార్జ్ డీఆర్ఓ చంద్రావతితో కలిసి అదనపు కలెక్టర్ అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి మొత్తం 99 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ఈ దరఖాస్తులలో గృహ నిర్మాణ శాఖకు సంబంధించినవి అత్యధికంగా 33 ఉన్నాయని వెల్లడించారు.
ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ప్రతి దరఖాస్తును బాధ్యతగా పరిగణించి, సంబంధిత అధికారులు త్వరితగతిన పరిష్కరించాల్సిన అవసరం ఉందని అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో, వ్యయప్రయాసలతో కలెక్టరేట్‌కు వస్తారని, వారి నమ్మకాన్ని నిలబెట్టే విధంగా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
ఏదైనా దరఖాస్తును తిరస్కరించాల్సి వస్తే, అందుకు గల కారణాలను అర్జీదారులకు స్పష్టంగా వివరించాలని అధికారులకు సూచనలు జారీ చేశారు. ప్రజావాణి ద్వారా స్వీకరించిన దరఖాస్తులపై తీసుకున్న చర్యల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

