దివ్యాంగులు మానసిక ధైర్యంతో ఆర్థికంగా ఎదగాలని, అందుకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి అన్నారు. అల్వాల్‌లోని సఖీ సెంటర్లో దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, వీల్ చైర్లను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
జిల్లా మహిళా, శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ ఫైజన్ అహ్మద్ కలిసి లబ్ధిదారులకు సహాయ పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా 56 ట్రై సైకిళ్లు, 14 వీల్ చైర్లను పంపిణీ చేశారు.
దివ్యాంగులు సొంతంగా వ్యాపారాలు, స్టార్టప్‌లు లేదా దుకాణాలు ప్రారంభించాలనుకుంటే, వారికి ప్రభుత్వం తరపున పూర్తి స్థాయి మార్గనిర్దేశం, ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. దివ్యాంగుల పిల్లల భవిష్యత్తు కోసం కెరీర్ కౌన్సెలింగ్, నైపుణ్యాభివృద్ధి కోర్సుల ద్వారా వారి సామర్థ్యాలను పెంపొందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
“నేడు ఉన్న స్థితి కంటే రేపు మెరుగ్గా ఉండాలి” అనే లక్ష్యంతో ముందుకు సాగితే జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ విడతలో సహాయ పరికరాలు అందని వారికి తదుపరి విడతలో తప్పకుండా అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. అనంతరం కలెక్టర్ సఖీ సెంటర్‌ను సందర్శించి, అక్కడ అందిస్తున్న సేవల గురించి అధికారులతో చర్చించారు.

