పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్ దాడి జరిగినట్లు సమాచారం. ఈ దాడిలో ఒక ఆయిల్ ట్యాంకర్ డ్రోన్‌ను ఢీ కొట్టడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో, ఇరాన్‌కు చెందిన డ్రోన్లు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా దూసుకువెళ్లాయని, వాటిలో ఒకటి విమానాశ్రయ పరిసరాల్లోని ఆయిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా ట్యాంకర్ పేలిపోయి, పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. విమానాశ్రయం చుట్టూ దట్టమైన పొగ అలుముకోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
కువైట్ ప్రభుత్వం వెంటనే స్పందించి, మంటలను అదుపులోకి తీసుకురావడానికి రెస్క్యూ బృందాలను రంగంలోకి దించింది. ఈ ఘటన కువైట్ భద్రతా వ్యవస్థలను అప్రమత్తం చేసిందని, పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇరాన్ నుంచి వచ్చిన పలు డ్రోన్లు, క్షిపణులను తమ రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయని కువైట్ దళాలు పేర్కొన్నాయి.
కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, కేవలం ఆస్తి నష్టం మాత్రమే సంభవించిందని ధృవీకరించింది. ఈ దాడి ప్రాంతీయ భద్రతపై ఆందోళనలను మరింత పెంచుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్ దాడులు పెరుగుతున్నాయని వారు తెలిపారు.







