పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధంపై ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధంలో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
మూడు వారాలుగా కొనసాగుతున్న ఈ యుద్ధం ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపుతోందని, భారత్కు కూడా అనేక సవాళ్లను తెచ్చిపెట్టిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ సంక్షోభం కారణంగా ప్రభావితమైన ప్రాంతాలలో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ఆయన వెల్లడించారు.
ఈ విషయంలో అనేక దేశాధినేతలతో సంప్రదింపులు జరిపినట్లు ప్రధాని తెలిపారు. ఇప్పటివరకు, సుమారు 3.75 లక్షల మంది భారతీయులను యుద్ధ ప్రభావిత ప్రాంతాల నుండి సురక్షితంగా భారత్కు తరలించామని, వీరిలో ఇరాన్ నుంచి 1,000 మంది ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
ప్రభావానికి గురైన ప్రతి భారతీయుడి భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వారిని స్వదేశానికి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. అంతర్జాతీయంగా శాంతిభద్రతలకు ముప్పు కలిగిస్తున్న ఈ సంక్షోభంపై భారత్ నిశితంగా పరిశీలిస్తోందని ఆయన అన్నారు.











