మహబూబాబాద్ జిల్లా కురవిలో పోలీసులమని చెప్పుకుంటూ డబ్బు వసూలు చేస్తున్న ఎర్పుల నాగరాజు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిర్యాదుదారుడైన పులిచింతల శ్రీనివాస్ నుంచి రూ.22,300 నగదును మోసపూరితంగా తీసుకున్నట్లు గుర్తించారు.
మహాశివరాత్రి జాతర సందర్భంగా, నిందితుడు బాధితుడిని బెదిరించి నగదుతో పాటు ఫోన్‌పే ద్వారా డబ్బులు కాజేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడిని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
పోలీసుల సమాచారం ప్రకారం, నిందితుడు గతంలో కూడా పలువురిని ఇదే విధంగా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. నిర్మానుష్య ప్రదేశాల్లో ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని, తాను పోలీసునని చెప్పి వారి నుంచి డబ్బులు గుంజుతున్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వ అధికారుల పేరుతో మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని కురవి ఎస్సై గండ్రాతి సతీష్ హెచ్చరించారు. ఇలాంటి సంఘటనలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.











