హైదరాబాద్‌లో భారీ రియల్ ఎస్టేట్ మోసం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది. భారతి బిల్డర్స్‌కు సంబంధించిన రూ.17.97 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసింది. ఈ మోసంలో 450 మందికి పైగా హోంబయ్యర్లు నష్టపోయినట్లు అధికారులు తెలిపారు.
భారతి బిల్డర్స్ సంస్థ భాగస్వాములు, వారి కుటుంబ సభ్యులు, ఇతరులకు చెందిన చర, అచర ఆస్తులను ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA), 2002 కింద ఈడీ అటాచ్ చేసింది. సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ దర్యాప్తు కొనసాగుతోంది.
‘భారతి లేక్ వ్యూ టవర్స్’ పేరుతో ప్రీ-లాంచ్ స్కీమ్ ప్రకటించి, అనుమతులు లేకుండానే 450 మందికి పైగా హోంబయ్యర్ల నుంచి రూ.75 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. ప్రాజెక్ట్‌కు అవసరమైన అనుమతులు లేవని, భూమి ఇప్పటికే రుణాల కోసం పూచీకత్తుగా ఉందని వినియోగదారులకు తెలియనివ్వకుండా మోసం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
వసూలు చేసిన నిధులను ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి కాకుండా, అప్పుల చెల్లింపులు, వడ్డీలు, ఇతర ఆస్తుల కొనుగోలు, కమిషన్ల చెల్లింపులకు మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. ప్రాజెక్ట్ భూములను కూడా ఇతరులకు అమ్మేసినట్లు తెలిసింది.
ఈ కేసులో మరిన్ని ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల వివరాలపై ఈడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకతపై ఈ ఘటన మరోసారి చర్చనీయాంశమైంది.











