కూకట్పల్లి నియోజకవర్గంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో 2002 నాటి జాబితాను ప్రామాణికంగా తీసుకోవడం వల్ల అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోతున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ఆయన జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ, ప్రస్తుత సవరణ ప్రక్రియలో 2002 నాటి ఓటర్ల జాబితాను ఆధారంగా తీసుకోవడం వల్ల నియోజకవర్గంలోని అనేకమంది స్థానిక ఓటర్లు జాబితా నుంచి తొలగించబడుతున్నారని తెలిపారు. ఇది తమ ఓటు హక్కును కోల్పోయేలా చేస్తోందని, ప్రభుత్వం కావాలనే ఈ విధంగా కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ఇదే పరిస్థితి నెలకొందని, కాంగ్రెస్ ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉండే ఓటర్లను మాత్రమే గుర్తించి ఈ విధంగా చేయడం దారుణమని ఆయన విమర్శించారు. ఎంతోమంది ప్రజలు తమ ఓటు కోల్పోతున్నామని ఆవేదన చెందుతున్నారని, ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు.
అర్హులైన ఓటర్లందరికీ ఓటు హక్కు కల్పించేలా, ఈ ప్రక్రియను పునఃపరిశీలించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జోనల్ కమిషనర్ ను కోరారు. స్థానికంగా నివసిస్తున్న అర్హులైన ఓటర్లను గుర్తించి, వారిని జాబితాలో చేర్చాలని సూచించారు.
ఈ వినతి పత్రం సమర్పణ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్, సబియా గౌసుద్దీన్, మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ గౌసిద్దీన్ తదితరులు ఎమ్మెల్యేతో కలిసి పాల్గొన్నారు.











