కామారెడ్డి జిల్లా కేంద్రంలో నివాసముంటున్న ఒక ఎంపీడీవో ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. కుటుంబంతో కలిసి హైదరాబాద్ వెళ్లిన సమయంలో, దొంగలు అపార్ట్ మెంట్ లోకి చొరబడి తాళం పగులగొట్టి లోపల ఉన్న బంగారు ఆభరణాలు, నగదును అపహరించారు.
విద్యానగర్ కాలనీలోని శ్రీ సాయి అపార్ట్ మెంట్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజంపేట ఎంపీడీవో బాలకృష్ణ, తన కుటుంబంతో కలిసి ఆస్పత్రి పనిమీద హైదరాబాద్ వెళ్లగా, ఈ ఖాళీని ఆసరాగా చేసుకుని దొంగలు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. అపార్ట్ మెంట్ లోకి చొరబడిన దొంగలు, తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించారు.
దొంగతనం జరిగిన విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, పరిసరాలను పరిశీలించి, విచారణ చేపట్టారు. శుభకార్యాల సీజన్ కావడంతో ఇంట్లో ఎక్కువ మొత్తంలో బంగారం, వెండి, నగదు నిల్వ ఉన్నట్లు తెలుస్తోంది.
బాధితులు పోలీసులకు అందించిన ఫిర్యాదు ప్రకారం, సుమారు 40 తులాల బంగారం, 60 తులాల వెండి, లక్ష రూపాయల నగదు చోరీకి గురైనట్లు సమాచారం. క్లూస్ టీం సంఘటనా స్థలం నుంచి వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించింది.
పోలీసులు అపార్ట్ మెంట్ తో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దొంగలను త్వరగా పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ నరహరి తెలిపారు.












