ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో 25వ వార్డు కౌన్సిలర్ భూపేందర్ నడుపుతున్న కారు ఢీకొట్టడంతో చెంగేల ఆరాధన అనే మహిళ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, కేసు నమోదు చేయడంలో జరుగుతున్న జాప్యంపై బాధితురాలి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మామిపల్లి గ్రామానికి చెందిన ఆరాధన, కౌన్సిలర్ భూపేందర్ కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై ప్రస్తుతం బెడ్‌కే పరిమితమయ్యారు. సంఘటన జరిగిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినా, 24 గంటలు గడిచినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడంపై కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
చిన్నపాటి ఫిర్యాదులపై కూడా తక్షణమే స్పందించే పోలీసులు, ఇలాంటి బలమైన గాయాలకు సంబంధించిన ఫిర్యాదులను ఎందుకు పట్టించుకోవడం లేదని బాధితురాలి కుటుంబీకులు ప్రశ్నిస్తున్నారు. ఈ జాప్యం వెనుక అధికార పార్టీ నాయకుల ఒత్తిడి ఉందా లేక పోలీసుల నిర్లక్ష్యమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
న్యాయం ఎప్పుడు జరుగుతుందోనని ఆరాధన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నత స్థాయి పోలీసు అధికారులు జోక్యం చేసుకుని, నిష్పాక్షికంగా విచారణ జరిపి, కౌన్సిలర్‌పై తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. పోలీసుల తీరుపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.












