కామారెడ్డి, 13.07.2026
వృద్ధ మహిళలకు కల్లు తాగించి, వారి ఆభరణాలను అపహరించిన కేసులో ఎల్లారెడ్డి పోలీసులు 48 గంటల్లోపు నిందితుడిని అరెస్ట్ చేశారు. చోరీకి గురైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని, నిందితుడిని రిమాండ్కు తరలించారు.
ఎల్లారెడ్డి పోలీసులు 48 గంటల్లోపు కేసును ఛేదించి, వృద్ధ మహిళల ఆభరణాలను అపహరించిన దొంగను అరెస్ట్ చేశారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు. చోరీకి గురైన బంగారం, వెండి ఆభరణాలను పోలీసులు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు.
కేసు వివరాలను ఎల్లారెడ్డి సీఐ డి. రాజారెడ్డి వెల్లడించారు. గత నెల 11వ తేదీన తలారి సంగయ్య తన తల్లి తలారి దుర్గవ్వ, పక్కింటి మహిళ కుక్కల పోశవ్వతో కలిసి ఇంటి వద్ద ఉండగా, ఓ గుర్తు తెలియని వ్యక్తి బెయిల్ పనిమీద వచ్చానని చెప్పి ఇంట్లోకి ప్రవేశించాడు. అనంతరం వారికి కల్లు తాగించి, వారు మత్తులోకి జారుకున్న సమయంలో తలారి దుర్గవ్వ మెడలోని సుమారు 12 గ్రాముల బంగారు గుండ్ల తాడును, కుక్కల పోశవ్వ చేతికి ఉన్న సుమారు 40 గ్రాముల వెండి పట్టే కడెమును లాక్కొని పరారయ్యాడు.
ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న ఎల్లారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
గతంలో బాన్సువాడ, ఎల్లారెడ్డి, లింగంపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన దొంగతనం కేసుల్లో జైలుకు వెళ్లిన ఇద్దరు నిందితులకు అక్కడ పరిచయం ఏర్పడిందని, వారిలో ఒకరు తన ఇంట్లోని బీరువాలో నగదు, బంగారం ఉన్నాయని చెప్పడంతో, మరో నిందితుడు వాటిని దొంగిలించాలని పథకం రచించినట్లు తెలిసింది. బెయిల్పై విడుదలైన అనంతరం నిందితుడు లింగారెడ్డిపేటలోని ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళాడు. అయితే, బీరువాలో విలువైన వస్తువులు లభించకపోవడంతో, అక్కడ ఉన్న వృద్ధ మహిళలకు కల్లు తాగించి మత్తులోకి నెట్టి, వారి ఆభరణాలను అపహరించి పరారయ్యాడు.
దర్యాప్తులో భాగంగా బాధితులు, స్థానికుల నుంచి వివరాలు సేకరించి, సీసీ కెమెరా దృశ్యాలు, పాత నేరస్తుల రికార్డులను విశ్లేషించిన పోలీసులు నిందితుడిని గుర్తించారు. దొంగిలించిన బంగారు ఆభరణాలను విక్రయించేందుకు ఎల్లారెడ్డిలోని బంగారు దుకాణాల వైపు వెళ్తుండగా, బాలాగౌడ్ ఫంక్షన్ హాల్ సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరం అంగీకరించడంతో కేసు ఛేదించారు.
నిందితుడి వివరాలు: నీరుడి సాయిలు, తండ్రి: బాలయ్య, వయస్సు: 49 సంవత్సరాలు, వృత్తి: కూలీ, నివాసం: కొండాపూర్ గ్రామం, లింగంపేట మండలం. నిందితుడి వద్ద నుండి 12 గ్రాముల బంగారు గుండ్ల తాడు, 40 గ్రాముల వెండి పట్టే కడెం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు సీఐ తెలిపారు.












