బెంగళూరులోని వైట్ ఫీల్డ్ ప్రాంతంలో ఒక తల్లి తన కుమార్తెను హత్య చేసి, ఆపై తాను ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వైట్ ఫీల్డ్ లోని ఇమ్మడిహళ్లి మెయిన్ రోడ్డులో ఉన్న ఒక అపార్ట్ మెంట్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త చంద్రశేఖర్ డ్యూటీకి వెళ్ళిన తర్వాత, భార్య సువర్ణ (45) తన కుమార్తె తారుణ్య (13)ను ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. అనంతరం, సువర్ణ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
కుమార్తె భవిష్యత్తుపై సువర్ణ తీవ్ర ఆందోళన చెందేదని, ఈ భయంతోనే ఈ ఘోరానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. తల్లి మానసిక పరిస్థితిపై పోలీసులు దృష్టి సారించారు.
ఈ ఘటనపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. భర్త చంద్రశేఖర్ తన భార్యపై ఫిర్యాదు చేయగా, సువర్ణ సోదరుడు కూడా లోతుగా విచారణ జరపాలని కోరుతూ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతుల కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడవుతాయని అధికారులు తెలిపారు.











