మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ప్రేమ పేరుతో యువతిని వేధించి, గొంతుకోసి హత్య చేసిన ఘటనలో నిందితుడు కూడా స్థానికుల దాడిలో మరణించాడు. ఈ ఘటన శనివారం జరగగా, నిందితుడు ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జడ్చర్లలోని ఒక పాఠశాలలో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న 22 ఏళ్ల వైష్ణవిని, 28 ఏళ్ల తేజ అనే యువకుడు శనివారం రోడ్డుపై కత్తితో గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. కొన్నాళ్లుగా తేజ వైష్ణవిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని, ఆమెకు వివాహం నిశ్చయం కావడంతో కక్ష పెంచుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని సమాచారం.
హత్య అనంతరం, స్థానికులు తేజను అడ్డుకుని, అతని చేతులు కట్టేసి బండరాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తేజను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆదివారం అతను మృతి చెందాడు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆధారాలు సేకరించారు. ఈ దారుణ హత్య స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.












