గుంటూరు నగరంలో క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెట్టి సుమారు రూ.13 కోట్లు నష్టపోయినట్లు ఒక ప్రముఖ ప్రైవేటు వైద్యుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఆన్లైన్లో అధిక లాభాలు ఆశచూపి, సైబర్ నేరగాళ్లు వైద్యుడిని నమ్మించి భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. తొలుత లాభాలు చూపించి, మరింత డబ్బును పెట్టుబడిగా పెట్టేలా చేసినట్లు సమాచారం.
ఈ మోసంలో వైద్యుడు తనతోపాటు మరికొందరు స్నేహితుల డబ్బును కూడా పెట్టినట్లు తెలిసింది. ఆన్లైన్ ఖాతాలో డబ్బులు కనిపిస్తున్నా, వాటిని విత్ డ్రా చేసుకోలేక పోవడంతో తాము మోసపోయామని బాధితులు గ్రహించారు.
ఈ ఘటనపై బాధితుడైన వైద్యుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ నేరగాళ్లను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ తరహా మోసాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.











