కరీంనగర్ జిల్లాలో "అరైవ్ అలైవ్" షెడ్యూల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించారు. వ్యాసరచన, చిత్రలేఖన పోటీలతో పాటు మానవ హారం కూడా చేపట్టారు.
జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, ఇల్లందకుంట ఎస్ హెచ్ ఓ క్రాంతి కుమార్ ల నేతృత్వంలో సిరిసేడు ప్రైమరీ స్కూల్ విద్యార్థులతో రహదారి భద్రతా దినోత్సవం పురస్కరించుకుని అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. వాహనదారులకు హెల్మెట్, సీటు బెల్ట్ వాడకం ప్రాముఖ్యతను వివరించారు.
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తూ పోస్ట్‌కార్డుల ద్వారా లేఖలు రాశారు. సిరిసేడు సెంటర్లో విద్యార్థులు, స్థానిక ప్రజలు కలిసి రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు మానవ హారం చేపట్టారు.
మండలంలోని మల్యాల, ఇల్లందకుంట ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు కూడా వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమాలలో పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.










