నల్గొండ జిల్లా దేవరకొండలో విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఏడీఈ) సిరికొండ సైదులు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. రూ.10 లక్షల బిల్లును మంజూరు చేసేందుకు రూ.30 వేలు డిమాండ్ చేసినట్లు సమాచారం.
కంబాలపల్లి సబ్స్టేషన్ పరిధిలో అక్టోబర్ 2025లో వీచిన గాలివానకు దెబ్బతిన్న 33/11 కేవీ విద్యుత్ లైన్లను ఒక వ్యక్తి పునరుద్ధరించారు. ఈ పనులకు సంబంధించిన రూ.10 లక్షల బిల్లును ప్రాసెస్ చేసి, పై అధికారులకు పంపే ప్రక్రియలో ఏడీఈ సైదులు లంచం అడిగారని బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు, ఏసీబీ అధికారులు వల పన్ని, ఏప్రిల్ 16న దేవరకొండలోని ఏడీఈ కార్యాలయంలో సైదులు లంచం డబ్బులు అందుకుంటుండగా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు.
విధి నిర్వహణలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడైన ఏడీఈ సైదులును అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం, అతన్ని జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు తెలిపారు.











