ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లా అడవుల్లో సోమవారం జరిగిన ఎదురుకాల్పుల్లో తెలంగాణకు చెందిన మహిళా మావోయిస్టు రూపిరెడ్డి మృతి చెందింది. ఆమెపై రూ.5 లక్షల రివార్డు ఉంది.
కాంకేర్ జిల్లా మచ్పల్లి అడవుల్లో మావోయిస్టులున్నారనే సమాచారం మేరకు కేంద్ర బలగాలు కూబింగ్ నిర్వహిస్తుండగా ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు పోలీసులు తెలిపారు. మరణించిన మావోయిస్టును అలియాస్ రంగబోయిన భాగ్యగా గుర్తించారు, ఆమె మచ్పల్లి ఏరియా కమిటీ సభ్యురాలిగా పనిచేస్తోందని వెల్లడించారు.
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం, ధర్మారం గ్రామానికి చెందిన రూపిరెడ్డి రెండు దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్లు, ఆమెపై ప్రభుత్వం గతంలో రూ. 5 లక్షల రివార్డు ప్రకటించినట్లు కాంకేర్ పోలీసులు తెలిపారు. రూపిరెడ్డి భర్త విజయ్ రెడ్డి కూడా గత ఏడాది జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు.
భర్త మరణం తర్వాత రూపిరెడ్డి భద్రతా దళాలపై ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరిగింది. చివరకు, భర్త మరణించిన ప్రాంతానికి సమీపంలోనే ఆమె కూడా ప్రాణాలు కోల్పోయింది. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోవాలని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ సూచించారు.
పోలియో బారిన పడి అశక్తురాలైనా సామాజిక అసమానతలపై గొంతెత్తాలనే సంకల్పంతో 2002లో మావోయిస్టు ఉద్యమంలో చేరిన భాగ్య, చత్తీస్‌గఢ్‌లోని నార్త్ బస్తర్ డివిజన్లో రూపి పేరుతో పార్థాపూర్ ఏరియా కమాండర్ స్థాయికి ఎదిగింది. ఆమె మృతదేహాన్ని బుధవారం స్వగ్రామంలో అంత్యక్రియలు జరగనున్నాయి.











