భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ అభివృద్ధి పనులు ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా, భక్తులకు ఇబ్బందులు లేకుండా చేపట్టాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆలయ అభివృద్ధి ప్రణాళికలపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భూసేకరణ పూర్తయిన ప్రాంతాల్లో ఆలయ అభివృద్ధికి సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు.
ఆగమశాస్త్రానికి అనుగుణంగా, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మూడు దశల్లో అభివృద్ధి పనులను పూర్తి చేయాలని సూచించారు. వచ్చే గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయగల పనులను గుర్తించి, వాటి అంచనాలతో తొలి దశ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
గోదావరి పుష్కరాల ప్రణాళికలకు అనుగుణంగా ఆలయ సమీపంలోని పుష్కర ఘాట్ల నిర్మాణం, అభివృద్ధి పనులు చేపట్టాలని తెలిపారు. 2027 మార్చి 31 నాటికి తొలిదశ పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. పుష్కరాల అనంతరం మిగిలిన పనుల కోసం కూడా ప్రణాళికలు, అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు.











