బెంగుళూరులో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రేమికుడు ఆత్మహత్య చేసుకున్న వార్తను తట్టుకోలేక అతని ప్రియురాలు కూడా భవనంపై నుండి దూకి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన ధణసింద్రలోని నికో హోమ్స్ అపార్ట్మెంట్లో వెలుగుచూసింది. ఇద్దరు యువకుల మరణంపై పోలీసులు అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సిద్దిపేట జిల్లాకు చెందిన భానుచందర్ రెడ్డి (32), మేడ్చల్ జిల్లాకు చెందిన బీబీ షాజియా సిరాజ్ (31) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని, వీరిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారని సమాచారం. భానుచందర్ రెడ్డి ఇటీవల స్వగ్రామానికి వెళ్లి తిరిగి బెంగుళూరు చేరుకున్నాక, తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రియుడి ఆత్మహత్య వార్తను తట్టుకోలేకపోయిన షాజియా, వారు నివసిస్తున్న అపార్ట్మెంట్ 17వ అంతస్తు పైనుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
స్థానికుల కథనం ప్రకారం, భానుచందర్ రెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, అందుకే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే, భానుచందర్ తల్లిదండ్రులు తమ కుమారుడు భారతదేశానికి వచ్చాడనే విషయం తమకు తెలియదని పేర్కొన్నారు. షాజియా కుటుంబ సభ్యులు ఆమె వివరాలు తెలిపేందుకు నిరాకరించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎలాంటి సూసైడ్ నోట్ లభించకపోవడంతో, ఈ మరణాలను అనుమానాస్పద మరణాలుగా పరిగణిస్తున్నారు. మరణానికి గల పూర్తి కారణాలపై ఆరా తీస్తున్నారు.











