పారిశ్రామిక వాడల్లోని కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వామపక్ష పార్టీలు ఈ నెల 24వ తేదీన ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపట్టనున్నాయి. ఈ మేరకు సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్), ఆర్ఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్, సీజీపీఐ పార్టీలు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి.
ఉత్తరప్రదేశ్ లోని నోయిడా, అలాగే ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్)లలోని పారిశ్రామిక వాడల్లో కనీస వేతనాల పెంపు, పని ప్రదేశాల్లో భద్రత వంటి అంశాలపై పోరాడుతున్న కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఈ పార్టీలు డిమాండ్ చేశాయి.
న్యాయమైన హక్కుల సాధన కోసం పోరాడుతున్న కార్మికులపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత చర్యలను వామపక్షాలు తీవ్రంగా ఖండించాయి.
ఈ నెల 24న న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని పార్టీలు పిలుపునిచ్చాయి. ధర్నా సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు, కేంద్ర కార్మిక శాఖ మంత్రికి వినతిపత్రాలు అందజేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నాయి.











