గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆదివారం నిరాహార దీక్ష ప్రారంభించారు. తన నివాసం, కార్యాలయంపై జరిగిన దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, కస్టడీలో తనను హింసించిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈ నిరసన దీక్షకు మద్దతుగా పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.
తన ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో తనతో దురుసుగా ప్రవర్తించిన పోలీసులను వదిలిపెట్టేది లేదని అంబటి రాంబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఈ దాడి వెనుక తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు, నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్లు ఉన్నారని, వారు దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన ఆరోపించారు.
దాడికి పాల్పడిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు తన పోరాటం కొనసాగుతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.











