సురక్షిత మాతృత్వం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మెడికల్ కళాశాల సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన 'సేఫ్ మదర్ డే' కార్యక్రమంలో వారు ఈ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న హెల్త్ వీక్ కార్యక్రమాల్లో భాగంగా ఈ 'సేఫ్ మదర్ డే' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు అవసరమైన ఆరోగ్య సేవలపై అవగాహన కల్పించారు. ఏఎన్సీ చెకప్‌లు, మాతృ మరణాల రేటు తగ్గించడం, సి-సెక్షన్, హై రిస్క్ గర్భధారణలు, అత్యవసర పరిస్థితులు, పీసీపీఎన్డీటీ చట్టం వంటి అంశాలపై వైద్యులకు వర్క్‌షాప్ నిర్వహించారు.
ముఖ్య అతిథులుగా హాజరైన టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ, తల్లి– బిడ్డల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని వైద్య సదుపాయాలను అందిస్తున్నదని తెలిపారు. గర్భధారణ ప్రారంభం నుంచే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, రక్తహీనత నివారణకు పోషకాహారం తీసుకోవాలని సూచించారు. మైనర్ బాలికల వివాహాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ, సురక్షిత ప్రసవాలు, తల్లి–శిశు ఆరోగ్య పరిరక్షణకు వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. గర్భధారణ సమయంలో సమయానుకూల వైద్య పరీక్షలు, టీకాలు, పోషకాహారం ద్వారా తల్లి, శిశువు ఆరోగ్యాన్ని కాపాడవచ్చని తెలిపారు. మాతృ మరణాల రేటును (Maternal Mortality) జీరోకు తీసుకురావడానికి సమగ్ర ప్రణాళికతో కృషి చేయాలని ఆమె సూచించారు.
కొత్తగా తల్లులైన మహిళలకు అవసరమైన జాగ్రత్తలపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి ఆసుపత్రి స్థాయిలో ఆశా, ఏఎన్ఎంల ద్వారా మండల సమాఖ్య మహిళలకు తల్లి–బిడ్డల సురక్షితంపై వర్క్‌షాప్‌లు నిర్వహించి, గర్భిణులకు సమగ్ర సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పీసీపీఎన్డీటీ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా సేఫ్ మదర్ హుడ్ పోస్టర్లను ఆవిష్కరించారు.












