జిల్లాలో ప్రసవాల సందర్భంగా ఎక్కడ కూడా మాతృ మరణాలు చోటు చేసుకోకుండా ముందస్తుగా క్రమం తప్పకుండా వైద్య సేవలు అందిస్తూ, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య వైద్యాధికారులను ఆదేశించారు. మాతృ మరణాలపై ఆమె జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఆడిట్ నిర్వహించారు.
కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమీక్షలో, జిల్లాలో చోటుచేసుకున్న మాతృ మరణాలపై కలెక్టర్ సవివరంగా చర్చించారు. ఏ ఆసుపత్రిలో ఘటన చోటు చేసుకుంది, మరణానికి దారితీసిన కారణాలు ఏమిటి, వైద్య సేవలలో ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగిందా అనే అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆదేశించారు.
సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు, బాధిత కుటుంబ సభ్యులను విచారించి వాస్తవ పరిస్థితులను నిర్ధారించుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
మహిళలు గర్భం దాల్చిన నాటి నుంచే వారికి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సేవలు అందించాలన్నారు. గర్భిణులకు సరైన మార్గదర్శకాలు అందిస్తూ, సకాలంలో చికిత్సలు పొందేలా వైద్య సిబ్బంది పర్యవేక్షణను బలోపేతం చేయాలని సూచించారు. హై రిస్క్ గర్భిణుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, గైనకాలజిస్ట్లు మరియు వైద్య సిబ్బంది నిరంతర పర్యవేక్షణలో చికిత్స అందించాలని ఆదేశించారు.
మాతృ మరణాల నివారణకు ప్రతి వైద్యాధికారి బాధ్యతగా పని చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ వసంత్ రావు, జీజీహెచ్ సూపరిండెంట్ మురళికృష్ణ, ప్రోగ్రాం ఆఫీసర్ (ఎంసీహెచ్) డాక్టర్ నాగలక్ష్మి, డాక్టర్ శశాంక్, సంబంధిత వైద్యాధికారులు, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.












