ధర్మవరం నియోజకవర్గ ప్రజల కోసం పోతుకుంట ఏరియా ఆసుపత్రిలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభమైంది. సంస్కృతి సేవా సమితి, శంకర నేత్రాలయ (USA) సంయుక్తంగా ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అత్యాధునిక మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ ద్వారా ఉచిత కంటి ఆపరేషన్లు, లెన్స్ అమరికలు చేపట్టనున్నారు.
గౌరవ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి సతీమణి శ్రీమతి త్రివేణి గారు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అత్యాధునిక MESU యూనిట్ ద్వారా మైక్రోస్కోపిక్ పద్ధతిలో కుట్లు లేని ఆపరేషన్లు, ఉచిత IOL లెన్స్‌ల పంపిణీ జరుగుతుందని తెలిపారు. కంటి పరీక్షలతో పాటు బీపీ, షుగర్ వంటి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు కూడా ఉచితంగా అందిస్తున్నారు.
మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ప్రజలకు పిలుపునిస్తూ, ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యవంతమైన ధర్మవరం నిర్మాణమే లక్ష్యంగా ఈ సేవా కార్యక్రమం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ శిబిరం ఏప్రిల్ 14 వరకు ప్రతిరోజూ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. సంస్కృతి సేవా సమితి, పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం సేవా కార్యక్రమాలు చేపడుతూనే ఉందని, ఈ కంటి వైద్య శిబిరం కూడా దానిలో భాగమని నిర్వాహకులు తెలిపారు.











